వైసీపీ అధికారంలోకి రాదన్న ప్రశాంత్ కిషోర్.. ప్యాకేజ్ తీసుకుని మాట్లాడారన్న బొత్స
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచే అవకాశాలు క్లిష్టంగా వున్నాయంటూ పీకే వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
సోమవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. లీడర్‌కు, ప్రొవైడర్‌కు తేడా తెలియదా .. జగన్ లీడర్ అయితే, చంద్రబాబు ప్రొవైడర్ అంటూ బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కోసం ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతున్నారని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్యాకేజీలు తీసుకునే ప్రశాంత్ కిషోర్ పని చేస్తారని.. ప్యాకేజీ ఇస్తే ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని పీకే డబ్బాలు కొడుతున్నాడని.. కానీ జగన్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బొత్స చెప్పారు. జగన్ అన్ని రంగాల్లో మార్పులు తీసుకొచ్చారని.. గతంలో ఏపీ 16, 15 స్థానాల్లో వుండేదని కానీ జగన్ వచ్చాక 4, 5 స్థానాల్లో వుంటోందని సత్యనారాయణ తెలిపారు.
ప్రశాంత్ కిషోర్‌ను బీహార్ నుంచి తరిమికొట్టారని.. ఏపీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని మంత్రి హెచ్చరించారు. పీకే మా దగ్గర ఐదేళ్లు పనిచేశారని.. ఆయన ఆలోచనలు ఎలా వుంటాయో మాకు తెలుసునని బొత్స తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని పీకే వ్యాఖ్యానించారు. ఆయనను ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్‌తో పోల్చారు. గతంలో రాజుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పించి ఏం చేయలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
భఘేల్ మాదిరిగానే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులుగా నియోజకవర్గాలకు ప్రొవైడర్‌గానే జగన్ వుండిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని.. ఒడిషా, బెంగాల్‌లలోనూ ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కుతాయని పీకే అంచనా వేశారు. విపక్షాలకు బీజేపీని ఓడించేందుకు అవకాశాలున్నా.. కేవలం బద్ధకం, సరైన వ్యూహాం లేకపోడంతోనే అది కుదరడం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
విపక్షాల పోరాటం అంతా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వుందని అటువంటప్పుడు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అమేథీలో పోటీ చేయకపోవడంపైనా ప్రశాంత్ కిశోర్ స్పందించారు. అక్కడి నుంచి పోటీ చేయకపోవడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుందని పీకే పేర్కొన్నారు. హిందీ బెల్ట్‌లో గణనీయమైన ఉనికి వుంటే తప్పించి భారత్‌ను గెలవలేరన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో గెలవకుండా వయనాడ్ నుంచి గెలిస్తే ప్రయోజనం వుండదన్నారు.
చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.
— YSR Congress Party (@YSRCParty) April 8, 2024
ఆయన పనితనం ఏంటో బీహార్‌లో చూశాం కదా?
-మంత్రి బొత్స సత్యనారాయణ#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/13ZaV8dC2k
Comments
Post a Comment